ఆరేళ్లలోపు బాలల సమగ్రాభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్.)
ఆరు సంవత్సరాల లోపు బాలల పోషకాహార పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడం
బాలల మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి రంగాన్ని సిద్ధం చేయడం
ఈ వయో పరిమితిలోని బాలల మరణాల సంఖ్యను, జబ్బునపడేవారి సంఖ్యను, పోషకాహార లోపాన్ని, బడి మానివేసే శాతాన్ని వీలున్నంత వరకు తగ్గించడం
బాలల అభివృద్ధికి దోహదం చేసే విధంగా, ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య విధాన పరంగా, అమలు పరంగా తగిన సమన్వయం సాధించడం.
బాలల సాధారణ ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార అవసరాలను గమనించగలిగే విధంగా, పోషకాహారం, ఆరోగ్య అంశాలలో తల్లులకు తగిన అవగాహన కల్పించడం
పోషకాహారం
6 నెలలు-6 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలు ఇచ్చే తల్లులకు పోషకాహారాన్ని సమకూర్చడంలో భాగంగా, అనుబంధ ఆహారాన్ని అందించడం, ఐ.సి.డీ.ఎస్. పథకంలోని ప్రధాన సేవలలో ఒకటి. పేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
లబ్ధిదారులకు, రెండురకాల అనుబంధ ఆహారాన్ని అందజేయడం జరుగుతున్నది.
వీటిలో ఒకటి, వెంటనే తినడానికి అనువైన ఆహారం ( రెడీ టు ఈట్ ఫుడ్ మోడల్ ...ఆర్ టి ఇ ) కాగా, రెండవది, స్థానికంగా లభించే ఆహారం ( లోకల్ ఫుడ్ మోడల్....ఎల్.ఎఫ్.ఎం.). ఒక్కొక్క లబ్ధిదారుకు, రోజుకు 2 రూపాయల వంతున ఖర్చుతో, ఈ అదనపు ఆహారాన్ని అందజేస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ, " ఏ. పి. ఫుడ్స్ '', ఆర్.టి.ఇ. ని తయారుచేసి, 213 ఐ.సి.డి.ఎస్. కేంద్రాలకు సరఫరా చేస్తుంది. వెనువెంటనే మిఠాయి ఉండలు చేసుకోవడానికి వీలైన పొడి, స్నాక్స్ వంటి వాటిని ఏ. పి. ఫుడ్స్ సరఫరా చేస్తున్నది. ఈ ఆహార పదార్ధాలను గోధుమలు, చక్కెర, సోయా, విటమిన్లతో తయారుచేస్తారు. లబ్ధిదారులకు తినడానికి ఇచ్చేముందు, మిఠాయి పొడికి, కొద్దిగా నీళ్ళు కలిపి, వుండలుగా చేసి అందజేస్తారు. ఎప్పూడూ ఒకే రకమైన ఆహారంతో అందించడం ఆపి, ఇటీవల రకరకాల తినుబండారాలను ప్రవేశపెట్టారు.
అనుబంధ పోషకాహార కార్యక్రమాన్ని ( సప్లిమెంటరి న్యూట్రిషన్ ప్రోగ్రాం...ఎస్ ఎన్ పి ) స్థానిక ప్రజల భాగస్వామ్యంతో విస్తరించడానికి, నాణ్యతను మెరుగు పరచి, లబ్ధిదారులకు ఆసక్తిదాయకంగా చేయడానికి వీలుగా, 159 ఐ.సి.డి.ఎస్. కేంద్రాలలో, స్థానిక ఆహారాన్ని సరఫరా చేయడం జరుగుతున్నది.
స్థానిక ఆహార విభాగంలో ఈ కింది ఆహార పదార్ధాలను సరఫరా చేస్తున్నారు
వేడి పొంగలి
గోధుమ రవ్వ కిచిడి
స్థానిక ఆహార పదార్ధాల తయారీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంకోసం, కేర్- ఏ.పి. తో కలసి, రాష్ట్రంలోని నాలుగు ఐ.సి.డి.ఎస్. కేంద్రాల పరిధిలో ( వేములవాడ, సిరిసిల్ల, కూనవరం, తిరుపతి) స్థానిక ప్రజల నిర్వహణలో ఎస్ ఎన్ పి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
జాతీయ పోషకాహార కార్యక్రమం ( నేషనల్ న్యూట్రిషన్ మిషన్) కింద, మనరాష్ట్రంలో, పోషకాహార పరంగా వెనుకబడిన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో, పోషకాహారలోపం కలిగిన కౌమార (అడొలసెంట్) బాలికలకు ఆహారధాన్యాలను అందించడంకోసం, ప్రణాళికా సంఘం వారు కేంద్ర నిధులను అదనంగా కేటాయించారు. ఈ కార్యక్రమం కింద లభ్ధిపొందే ప్రతి బాలికకు, నెలకు 6 కిలోల బియ్యం ఇస్తారు.
Comments
Post a Comment